
మాచర్ల మండలం ముత్యాలంపాడు గ్రామ రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమం రైతులకు శాశ్వత భద్రతను కల్పిస్తుందని పేర్కొన్నారు.
సమాజంలో ప్రశాంతత నెలకొనాలంటే భూ వివాదాలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వానికి వస్తున్న ఫిర్యాదుల్లో దాదాపు 75 శాతం భూములకు సంబంధించినవేనని తెలిపారు. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రీ-సర్వే కార్యక్రమాన్ని చేపట్టిందని చెప్పారు.
గత పాలనలో భూ రికార్డుల్లో జరిగిన అవకతవకల కారణంగా అనేక మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కొందరి ఆస్తులను ఇతరుల పేర్లతో నమోదు చేసి రుణాలు పొందిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్యంగా పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గంలో భూ సమస్యలు అధికంగా ఉన్నాయని, రీ-సర్వే కార్యక్రమం రైతులకు ఒక వరంగా మారిందన్నారు.
రీ-సర్వే పూర్తయిన తర్వాత ఎవరి భూమి వారికే స్పష్టంగా గుర్తింపు లభిస్తుందని, కుటుంబ సభ్యుల మధ్య, అన్నదమ్ముల మధ్య, బంధువుల మధ్య భూముల వివాదాలు తగ్గుతాయని తెలిపారు. ఒక గజం, ఒక సెంటు భూమి కోసం కోర్టులు, పోలీస్ స్టేషన్లు, లాయర్ల చుట్టూ తిరుగుతూ సమయం, ధనం వృథా చేసుకోవాల్సిన పరిస్థితి ఉండదన్నారు.
భవిష్యత్తులో భూముల కొనుగోలు సమయంలో టైటిల్ క్లియర్‌గా ఉందో లేదో సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని, అందువల్ల రైతులు సర్వే జరిగే సమయంలో తప్పనిసరిగా పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు. “నేను ఊరిలో లేను, బయటకు వెళ్లాను” అనే కారణాలతో సర్వేకు దూరంగా ఉంటే తరువాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
రైతుల భూములపై రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేస్తూ ప్రభుత్వం రైతుల హక్కులకు భరోసా కల్పిస్తోందన్నారు. మధ్యవర్తులు, బ్రోకర్లు, అనవసర ఖర్చులు లేకుండా రైతులకు నేరుగా సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
మాచర్ల నియోజకవర్గంలో ఇప్పటికే అరకు జమ్మలమడక, రాయవరం, తాళ్లపల్లి, నాగులవరం, ఖమ్మంపాడు తదితర గ్రామాల్లో కలిపి సుమారు 8,600 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా భారీ వ్యయంతో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టిన ఈ రీ-సర్వే కార్యక్రమాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకుని తమ భూములపై శాశ్వత హక్కులను పొందాలని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కిరణ్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గుండాల శ్రీనివాసరావు, హౌసింగ్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.

