
మాచర్ల నియోజకవర్గంలోని మాచర్ల పట్టణం నరిశెట్టి కళ్యాణ మండపంలో APSRTC విభాగంలో సూపర్వైజర్గా సేవలందించి పదవీ విరమణ పొందిన కొనుగంటి పూర్ణచంద్ర శేఖర్ రెడ్డి కి ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ సేవలో నిజాయితీ, క్రమశిక్షణతో విధులు నిర్వహించి సహోద్యోగులు, ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్న పూర్ణచంద్ర శేఖర్ రెడ్డి సేవలు ఆదర్శప్రాయమని కొనియాడారు. ఉద్యోగ జీవితంలో ఆయన అందించిన సేవలు గుర్తుండిపోతాయని పేర్కొన్నారు.
అనంతరం పదవీ విరమణ పొందిన పూర్ణచంద్ర శేఖర్ రెడ్డిని శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేసి అభినందనలు తెలిపారు. ఆయన ఆరోగ్యంగా, ఆనందంగా కుటుంబ సభ్యులతో కలిసి పదవీ విరమణ జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
