
పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గంలో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి మహానాడు సభల విజయంపై స్పందించారు. మహానాడు కార్యక్రమాలను విజయవంతం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
మహానాడు ద్వారా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు స్పష్టమైన సందేశం వెళ్లిందన్నారు. గత జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన, “వెన్నుపోటు” అనే పదానికి జగన్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని వ్యాఖ్యానించారు.
గత ప్రభుత్వంలో కరెంట్ ఛార్జీలు పెంపు, మద్యం విధానాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయని వెల్లడించారు.
పెట్టుబడుల ద్వారా యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. 75 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు రోజుకు 16 నుంచి 18 గంటల పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారని కొనియాడారు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజల మధ్య నిలబడి ధైర్యం చెప్పే నాయకుడు చంద్రబాబేనని అన్నారు.
ప్రజలు ఒక్క ఓటు విలువను గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే, గత ఐదేళ్ల పరిస్థితులను ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధితో పోల్చి చూడాలని సూచించారు. భవిష్యత్తులో కూడా ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు
