
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ పార్క్ సెంటర్ మీదుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుంది. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ రాణికి సమస్యలపై వినతిపత్రాన్ని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అందజేశారు.
ఈ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతోందన్నారు. ఇంధన ధరల పెరుగుదల కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు కూడా అమాంతం పెరిగి ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పెరిగిన ధరలను తగ్గించి ప్రజలకు ఊరట కల్పించాలని డిమాండ్ చేశారు.
అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యువకులపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగా తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శిస్తూ, రానున్న రోజుల్లో అక్రమ కేసులు పెట్టించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
