
సెప్టెంబర్‌లో నోటిఫికేషన్… డిసెంబర్‌లోగా స్థానిక ఎన్నికలు పూర్తి? ఏపీలో కసరత్తు వేగం
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం వేగంగా అడుగులు వేస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజాస్వామ్య పాలనను పునరుద్ధరించే దిశగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా సన్నాహాలను ముమ్మరం చేశారు. ఈ ఎన్నికలకు సంబంధించిన కీలక వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
తాజా సమాచారం ప్రకారం, ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. డిసెంబర్ నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి, 2027 కొత్త సంవత్సర ఆరంభానికే నూతన పాలకవర్గాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం లక్ష్యంగా పెట్టుకుంది.
నోటిఫికేషన్‌కు ముందు అత్యంత కీలకమైన బీసీ రిజర్వేషన్ల అంశంపై డెడికేటెడ్ కమిషన్ వచ్చే నెలలో నివేదిక సమర్పించనుంది. ఆ నివేదిక ఆధారంగా జూలై నాటికి రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో, రాష్ట్రవ్యాప్తంగా 123 పట్టణ స్థానిక సంస్థల్లో డివిజన్లు, వార్డుల పునర్విభజన ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ జూన్ 26 నాటికి పూర్తి కావాల్సి ఉంది.
ఇప్పటికే 13,291 గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితా ప్రచురణ పూర్తయింది. ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.36 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.
ఎన్నికల ఏర్పాట్లపై పంచాయతీరాజ్, పురపాలక, బీసీ సంక్షేమ శాఖలతో ఎన్నికల కమిషనర్ వరుస సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. కోర్టు కేసులు ఉన్న 56 పంచాయతీలను మినహాయించి మిగతా ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరగబోయే తొలి కూటమి ఎన్నికలు కావడంతో రాజకీయ వర్గాలు, ప్రజల్లో ఈ ఎన్నికలపై భారీ ఆసక్తి నెలకొంది. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.
