మన పల్నాడు ప్రాంతంలోని దాచేపల్లి మండలం కొత్తూరు గ్రామానికి సమీపంలో, పొందుగల వెళ్లే రోడ్డులో ఉన్న అయ్యవారిపాలెం శివారు ప్రాంతంలో వెలసిన అతి ప్రాచీన శివాలయం విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది.
బొబ్బ నాగమ్మ నిర్మించిన ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయం దాదాపు వెయ్యి సంవత్సరాల పైబడి చారిత్రక వైభవాన్ని కలిగి ఉంది. ఎన్నో సంవత్సరాలుగా పురావస్తు శాఖ పరిధిలో ఉన్నప్పటికీ పునరుద్ధరణ పనులు జరగలేదు. అయితే ప్రస్తుతం పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభమవడం పల్నాడు ప్రజలకు ఆనందకర విషయం.
ఈ ఆలయంలో శివదేవుని విగ్రహం సాధారణంగా ఇతర శివాలయాల్లో కనిపించే లింగరూపంలో కాకుండా భిన్న రూపంలో ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇది ఈ దేవాలయానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, చారిత్రక గుర్తింపును తీసుకొస్తోంది.
ఇలాంటి మహిమాన్వితమైన పురాతన దేవాలయాలు పల్నాడు ప్రాంతానికి సొంతం కావడం గర్వకారణం. చారిత్రకంగా వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేసి, ఇలాంటి దేవాలయాలను పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పల్నాడు ఒక అద్భుత ఆధ్యాత్మిక టూరిజం హబ్‌గా అవతరించే అవకాశం ఉంది.
ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, చారిత్రక కట్టడాల పరిరక్షణతో పాటు టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటే పల్నాడు ప్రాంతం ఆర్థికంగా, సాంస్కృతికంగా మరింత అభివృద్ధి చెందుతుంది.

