రేపల్లె నియోజకవర్గ రాజకీయాలలో ఊహించని అనూహ్యమైన మార్పు చోటుచేసుకుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రముఖ వ్యాపారవేత్త పీట నాగకృష్ణమోహన్‌ను నియమించారు.
పీట నాగకృష్ణమోహన్ నియామకంపై ఆయన అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న ఆయనకు ఈ బాధ్యతలు రావడం పార్టీకి కొత్త ఊపునిస్తుందని అభిప్రాయపడుతున్నారు.
అయితే ఈ నియామకంపై పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. ఇప్పటికే మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి టిడిపిలో చేరిన నేపథ్యంలో నియోజకవర్గ రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.
మోపిదేవి వలస అనంతరం ఈవూరు గణేష్‌కు సమన్వయకర్త బాధ్యతలు అప్పగించగా, కార్యకర్తలు క్రమంగా ఒక దారికి వస్తున్న సమయంలో ఈ కొత్త మార్పు ఆసక్తి రేపుతోంది. అటు టిడిపి, ఇటు వైసీపీ మధ్య రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయో చూడాలి.
రాబోయే రోజుల్లో రేపల్లె రాజకీయాల్లో మరిన్ని పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

