
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో జరిగిన కారుపై దాడి ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్, మాచర్ల పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొమెర దుర్గారావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం సాయంత్రం తాను బజారులో దిగి తన కారును ఇంటి వద్ద పెట్టమని తన కుమారుడికి చెప్పిన సమయంలో వైసీపీకి చెందిన ఒక వ్యక్తి అక్కడికి వచ్చి తనపై అసభ్య పదజాలంతో దూషించాడని తెలిపారు.
ఆ సమయంలో తన కుమారుడి గొంతు పట్టుకొని, స్కార్పియో కారుపై రాళ్లతో దాడి చేసి అద్దాలు పగలగొట్టినట్లు చెప్పారు. గతంలో కూడా తన కారుపై దాడి చేసి తగలబెట్టిన ఘటన జరిగిందని, ఇప్పుడు మరోసారి అదే తరహాలో దాడి జరగడం తీవ్ర ఆందోళన కలిగించిందన్నారు. ఇలా తన కారుపై రెండుసార్లు దాడులు జరగడం వెనుక రాజకీయ కక్ష ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై వైసీపీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తనపై దాడి చేసిన వ్యక్తి టీడీపీకి చెందినవాడని ప్రచారం చేయడం పూర్తిగా అసత్యమని మండిపడ్డారు. మాచర్ల పట్టణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న తనకు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తెలియదా అని ప్రశ్నించారు.
తాను అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నందుకే తమపై కక్ష పెంచుకుంటున్నారా అంటూ ఆయన ప్రశ్నించారు. ఈ దాడి వెనుక ఎవరు ఉన్నా వదిలే ప్రసక్తి లేదని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని కొమెర దుర్గారావు స్పష్టం చేశారు.
