
కారంపూడి మండలం: మండలంలోని వేపకంపల్లి గ్రామంలో శుక్రవారం మేలు జాతి లేగదూడల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ మరియు పశుసంవర్ధక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకం అమలులో భాగంగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు.
కార్యక్రమాన్ని కారంపూడి మండల ఇంచార్జ్ పశువైద్యాధికారి డాక్టర్ డి. దిలీప్, పిడుగురాళ్ల మండలానికి చెందిన డాక్టర్ వి. శ్రీనివాసరెడ్డి, మాచవరం మండలానికి చెందిన డాక్టర్ వెంకటేశ్వర్లు ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ డి. దిలీప్ మాట్లాడుతూ పాడి పరిశ్రమను కేవలం ఒక ఆదాయ వనరుగా మాత్రమే కాకుండా సరైన విధంగా లేగదూడల పోషణ చేపడితే పశుపోషణ మరింత లాభదాయకంగా మారుతుందని తెలిపారు. గేదె జాతి పశువుల పునరుత్పత్తికి చలికాలం అనుకూలమని, రైతులు పశువుల్లో ఎద లక్షణాలను గమనించి వేసవి కాలానికి ముందే కృత్రిమ గర్భోత్పత్తి చేయిస్తే పశుపోషణలో మంచి ఫలితాలు పొందవచ్చని వివరించారు.
కార్యక్రమంలో పాల్గొన్న దూడలకు నట్టల నివారణ మందులు పైపరజైన్ తాపించారు. దూడల మరణాల శాతం తగ్గించేందుకు మరియు మెరుగైన జాతి దూడలు పుట్టేందుకు SSS సెమెన్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. దూడలలో తెల్లవీరేచనలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ ప్రదర్శనలో 35 మంది రైతులు పాల్గొని 42 దూడలను ప్రదర్శించారు. పాల్గొన్న పశుపోషకులకు ప్రోత్సాహక బహుమతులతో పాటు మినరల్ మిక్సర్, లివర్ టానిక్‌లు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంగులూరి అంజయ్య, కారంపూడి మండల ఎంపీపీ బోల్నేడి కనకదుర్గ శ్రీనివాసరావు, కారంపూడి టీడీపీ అధ్యక్షుడు గొల్ల సురేష్, పశువైద్య సిబ్బంది మరియు పాడి రైతులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
