

పల్నాడు జిల్లా మాచర్లలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం తిరునాళ్ల ఏర్పాట్లపై నిర్వహించిన అధికారుల సమీక్ష సమావేశంలో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పలు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 13వ శతాబ్దంలో పునర్నిర్మించబడిన ఈ దేవాలయం ఎంతో గొప్ప చరిత్ర కలిగినదని, మినీ మహాభారతం జరిగిన ప్రాంతంగా కూడా ఇది గుర్తింపు పొందిందని తెలిపారు. అయితే ఇంత చారిత్రాత్మక ప్రాముఖ్యత ఉన్న దేవస్థానం ఇప్పటివరకు సరైన రిపేర్లు కూడా పొందకపోవడం బాధాకరమని అన్నారు. ఈ చారిత్రాత్మక సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సూచించారు.
రాబోయే శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ తేదీన జరిగే రథోత్సవం ఎంతో ముఖ్యమైనదని, ఆ రోజు గ్రామ గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి రథోత్సవాన్ని దర్శించుకుంటారని చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు.
అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు స్వచ్ఛందంగా సేవాదళాలను ఏర్పాటు చేసి భక్తులకు సేవ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రథోత్సవం జరిగే మార్గంలో ఎక్కడా కూడా అంగళ్ళు, ఆక్రమణలు అనుమతించవద్దని, అది ఏ పార్టీ లేదా మతానికి చెందిన వారైనా సరే అధికారులు కఠినంగా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
రథోత్సవం జరిగే బజార్ ప్రాంతంలో భవనాలపైకి ప్రజలు ఎక్కి చూడడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. అలాగే రథానికి దగ్గరగా గొలుసులు పట్టకుండా కొంత దూరం నుంచే పట్టుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని, ఎవరైనా జారి పడితే ప్రమాదం నివారించేందుకు ఇది అవసరమని చెప్పారు.
రథోత్సవం జరిగే ప్రాంతానికి సమీపంలో వెంటిలేటర్ సౌకర్యం ఉన్న అంబులెన్స్‌ను ఏర్పాటు చేయాలని, అదనంగా మరో అంబులెన్స్‌ను సెంటర్‌లో సిద్ధంగా ఉంచాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినా లైటింగ్ సమస్య రాకుండా జనరేటర్ ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మున్సిపల్ సిబ్బందిని నియమించి విద్యుత్ వ్యవస్థపై పర్యవేక్షణ ఉండాలని చెప్పారు.
మున్సిపాలిటీ ద్వారా మైకింగ్ ఏర్పాటు చేసి భక్తులకు జాగ్రత్తలు తెలియజేయాలని, ముఖ్యంగా బంగారు నగలు ధరించి రావద్దని స్పష్టంగా ప్రకటించాలని సూచించారు. మాచర్లలో ఒక్క సంఘటన కూడా జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా ఘటన జరిగితే సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి హెచ్చరించారు.

