

చెన్నకేశవ స్వామి తిరునాళ్ల ఏర్పాట్లపై సమీక్ష – భక్తులకు పోలీసుల సూచనలు
పల్నాడు జిల్లా మాచర్లలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం తిరునాళ్ల ఏర్పాట్లపై నిర్వహించిన అధికారుల సమీక్ష సమావేశంలో గురజాల ఇన్‌చార్జ్ డీఎస్పీ వెంకటరమణ మాట్లాడారు. తిరునాళ్ల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. దర్శనం పూర్తైన తర్వాత భక్తులు ఆలయ ప్రాంగణంలో ఎక్కువసేపు ఉండకుండా త్వరగా బయటికి వెళ్లేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అదేవిధంగా గతంలో ఏర్పాటు చేసిన ప్రదేశాల్లోనే పార్కింగ్ సదుపాయాలు కల్పిస్తామని, భక్తులు మరియు వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అదనంగా మరికొన్ని పార్కింగ్ స్థలాలు కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ తిరునాళ్ల సమయంలో పట్టణంలో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. మహిళలు అధికంగా బంగారు నగలు ధరించి రావద్దని ప్రజలకు అవగాహన కల్పించాలని, రథోత్సవం వంటి వేడుకల సమయంలో దొంగతనాలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని భక్తులకు హెచ్చరికలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
అదేవిధంగా తిరునాళ్ల సమయంలో ఎవరైనా పిల్లలు లేదా వ్యక్తులు తప్పిపోతే వారిని వెంటనే కంట్రోల్ రూమ్‌కు తీసుకురావాలని, ఈ విషయంపై నిరంతరం అనౌన్స్‌మెంట్‌లు చేయాలని సూచించారు. భక్తుల భద్రత, సౌకర్యాల కోసం అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు
