

రెంటచింతలలో బొలెరో ప్రమాదం… 22 మందికి గాయాలు
పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గ పరిధిలోని రెంటచింతల మండలంలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దోర్నాల ప్రాంతం నుండి గురజాల మండలం గంగవరానికి మొక్కజొన్న కండలు విరచడానికి వెళ్తున్న కూలీలు ప్రయాణిస్తున్న బొలెరో (దోస్తు) వాహనం రెంటచింతల హైవేపై హోసన్న మందిరం సమీపానికి రాగానే అదుపుతప్పి కిందపడింది.
డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్ల వాహనాన్ని సరిగా నడపకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. వాహనంలో మొత్తం 25 మంది ప్రయాణిస్తుండగా, వారిలో 22 మందికి గాయాలు అయ్యాయి.
గాయపడిన వారిలో ఒక మహిళకు చెవుల నుండి రక్తస్రావం కావడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లతో పాటు స్థానికుల సహాయంతో ఆటోల ద్వారా గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ వారికి చికిత్స కొనసాగుతోంది.
ప్రమాదం అనంతరం వాహన డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
