మాచర్ల నుంచి గన్నవరం వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తి మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు.
మండల పరిధిలోని గన్నవరం గ్రామానికి చెందిన దగ్గుల రామకృష్ణారెడ్డి ద్విచక్రవాహనంపై కంభంపాడు దాటి గన్నవరం వైపు వెళ్తుండగా రహదారిపై అకస్మాత్తుగా గేదెలు రావడంతో వాహనం నియంత్రణ తప్పి స్కిడ్ అయింది. దీంతో ఆయన కిందపడిపోయి తీవ్ర గాయాలు పొందినట్లు సమాచారం.
స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రామకృష్ణారెడ్డిని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స అందించారు.
అయితే గాయాలు తీవ్రంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
