

మాచర్ల పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్, మాచర్ల పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొమెర దుర్గారావుకు చెందిన స్కార్పియో కారుపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు.
దుండగులు కారుతో వచ్చి దుర్గారావు కారును అడ్డగించి, అద్దాలను పగలగొట్టినట్లు సమాచారం. ఈ ఘటనతో మాచర్ల పట్టణంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాడికి పాల్పడిన కొంతమంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
ఈ సందర్భంగా కొమెర దుర్గారావు మాట్లాడుతూ, మాచర్ల పట్టణ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాను. అది చూసి ఓర్వలేక వైసీపీ పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
తాను బజార్ నుంచి వస్తున్న సమయంలో కారుపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారని తెలిపారు. గతంలో కూడా తన కారును దాడి చేసి తగలబెట్టారని, ఇటీవల ఫ్లెక్సీలు చించివేయడం వంటి ఘటనలు జరిగాయని పేర్కొన్నారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
