అరెస్టు చేసిన అంగన్వాడీ యూనియన్ నాయకులను వెంటనే విడుదల చేయాలని, అంగన్వాడీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మాచర్ల అంగన్వాడీ యూనియన్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక అంబేద్కర్ సెంటర్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ నాయకులు మాట్లాడుతూ అరకొర వేతనాలతో మాతా శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ టీచర్లుగా పనిచేస్తున్న తమకు కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలని ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామని తెలిపారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోవడంతో “చలో విజయవాడ” కార్యక్రమంలో పాల్గొన్నామని చెప్పారు.
చర్చలు సఫలం కాకపోవడంతో సోమవారం రాత్రి యూనియన్ నాయకులను అరెస్టు చేయడం అన్యాయమని, ఇది దుర్మార్గమైన చర్య అని తీవ్రంగా ఆక్షేపించారు. వెంటనే అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే రూ. 26 వేల కనీస వేతనం మంజూరు చేయాలని, చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ నిరసన కార్యక్రమంలో అంగన్వాడీ నేతలు ఉష, జయలక్ష్మీ, సైదమ్మ, ఎం. పద్మావతి, కె. పద్మ, శ్రీదేవి, కెవి. రుక్మిణి, శాంత తదితరులు పాల్గొన్నారు.

