



మాచర్ల: ప్రజా ఆరోగ్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెలిపారు. హాస్పిటల్‌లో ఉన్న సౌకర్యాలు, పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలను తెలుసుకునేందుకు ఆయన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించి, చికిత్స పొందుతున్న పేషెంట్లతో మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్‌లో అందుతున్న సేవలు, సౌకర్యాలపై వివరాలు సేకరించారు. ఈ తనిఖీలో ఆసుపత్రి చైర్మన్ వాసు గారు, డాక్టర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి పేదవాడి ఆరోగ్యం ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని చెప్పారు. ప్రజా ఆరోగ్యంపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారని, అప్పుడప్పుడు హాస్పిటళ్లు, హాస్టళ్లు వంటి ప్రభుత్వ సంస్థలను తనిఖీ చేయాలని సూచనలు ఇచ్చారని తెలిపారు. ఇలా తనిఖీలు చేయడం వల్ల అధికారుల్లో బాధ్యత పెరుగుతుందని అన్నారు.
ఇప్పటికే ఈ ఆసుపత్రికి నేషనల్ లెవెల్ అవార్డు రావడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఆసుపత్రిలో పారిశుధ్యం, టాయిలెట్లు, ఎలక్ట్రికల్ సమస్యలు లేకుండా చూసుకోవడం, వెయిటింగ్ హాల్ నిర్మాణం, వాహనాల పార్కింగ్ వంటి సదుపాయాలు మెరుగుపరిచామని చెప్పారు.
అవసరమైతే ఆసుపత్రి అభివృద్ధి కోసం తన సొంత నిధులను కూడా వినియోగించేందుకు సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే ఆసుపత్రిలో తాగునీటి సమస్య లేకుండా తన ఖర్చులతో 6 నుంచి 7 వాటర్ డిస్పెన్సర్లు ఏర్పాటు చేస్తానని ప్రకటించారు.
మహిళలు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వీలైనంత వరకు నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యం ఇవ్వాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే సిజేరియన్ చేయాలని సూచించారు.
అలాగే రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్–ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) విధానంలో ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని సంకల్పించిందని, భవిష్యత్తులో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే తెలిపారు.
