
రాష్ట్రంలోని పాఠశాలల్లో వేసవి దృష్ట్యా మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు.
ఆదేశాల ప్రకారం పాఠశాలలు ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించబడతాయి. అనంతరం విద్యార్థులకు 12:30 గంటలకు మధ్యాహ్న భోజనం అందజేస్తారు.
పదో తరగతి పరీక్ష కేంద్రాలుగా ఉన్న పాఠశాలలు మాత్రం మధ్యాహ్నం 1:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు కొనసాగుతాయని తెలిపారు. పరీక్షలున్నంతకాలం 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఇక వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు ఉంటాయని, జూన్ 12 నుంచి 2026–27 విద్యాసంవత్సరం ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.
అదేవిధంగా రంజాన్ సందర్భంగా ఉర్దూ మీడియం పాఠశాలలు మరియు డైట్ కళాశాలల్లో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు ఉదయం 8:00 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్చి 20 తర్వాత అదనపు తరగతులు నిర్వహిస్తారని చెప్పారు.
