
పల్నాడు జిల్లా మాచర్ల మండలం కొత్తపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు ఈ నెల 13న శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ధర్మకర్త అల్లం కోటిరెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచారి తెలిపారు.
బుధవారం ఆలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బ్రహ్మంగారి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారని చెప్పారు. అనంతరం వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమ్మ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి మేళతాళాలతో కళ్యాణ వేదికపైకి తీసుకువచ్చి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారని తెలిపారు.
సాయంత్రం 6 గంటలకు స్వామివారు, గోవిందమ్మ అమ్మవారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో మహిళల కోలాటాలు, కనకతప్పట్లు మధ్య పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం కులమతాలకు అతీతంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వివరించారు.
ఈ కళ్యాణ మహోత్సవ వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ నిర్వాహకులు కోరారు.
