

ఆంధ్రప్రదేశ్‌లో ఉగాది పండుగ సందర్భంగా 2.50 లక్షల మంది లబ్ధిదారులకు సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వ తరఫున లబ్ధిదారులకు అధికారిక లేఖలు అందజేయాలని అధికారులకు సీఎం సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఇసుక సరఫరా జరగాలని సీఎం స్పష్టం చేశారు. ఇసుకపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.
ఇటీవల ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ ఇండియా సమ్మిట్లో కుదిరిన ఒప్పందాలు త్వరగా అమలులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు. భారత్ జెన్, నెక్స్ జెన్, ఐబీఎం వంటి సంస్థలు ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయని, వచ్చే విద్యా సంవత్సరం నుంచే కోర్సులు ప్రారంభం అయ్యేలా చూడాలని సూచించారు.
అలాగే ఏఐ ఆగ్రానమిస్ట్, ఏఐ ట్యూటర్, ఏఐ డాక్టర్ వంటి సేవలను రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం అన్నారు. సీసీటీవీ యాప్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 14 వేల సీసీ కెమెరాలను అనుసంధానించి నేర నియంత్రణ చేపట్టాలని సూచించారు.
అదేవిధంగా ఓర్వకల్లు డ్రోన్ సిటీని త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావడంతో పాటు డ్రోన్ ఫ్లైయింగ్ ట్రాక్, రిమోట్ పైలట్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు.
ఈ సమీక్ష సమావేశంలో మంత్రి కొలుసు పార్ధసారధి, సీఎస్ సాయి ప్రసాద్, ఐటీ, ఆర్టీజీఎస్, గనులు, విద్య, ఆర్థిక, ప్రణాళిక శాఖల అధికారులు పాల్గొన్నారు.
