
ఆంధ్రప్రదేశ్‌లో ఖరీదైన మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించబోతోంది. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ప్రీమియం బ్రాండ్ల ధరలు అధికంగా ఉండటంతో వాటిని తగ్గించాలని ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
ప్రస్తుతం ఏపీలో విదేశీ మరియు ప్రీమియం బ్రాండ్ల మద్యం ధరలు తెలంగాణ, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల కంటే వేల రూపాయలు ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు ఒక ఫారిన్ లిక్కర్ సీసా తెలంగాణలో సుమారు రూ.22 వేల వరకు ఉంటే, అదే సీసా ఏపీలో రూ.25 వేలకుపైగా ఉంది. మరికొన్ని బ్రాండ్ల విషయంలో ఈ వ్యత్యాసం రూ.27 వేల నుంచి రూ.33 వేల వరకు ఉందని సమాచారం.
ఈ ధరల వ్యత్యాసం కారణంగా పలువురు మందుబాబులు పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తెచ్చుకుంటున్నారని అధికారులు గుర్తించారు. దీని వల్ల రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు రావాల్సిన ఆదాయం తగ్గిపోతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ నేపథ్యంలో దాదాపు 20 రకాల ప్రీమియం బ్రాండ్ల ధరలను తగ్గించాలని ఎక్సైజ్ శాఖ ప్రతిపాదించింది. ఒక్కో బాటిల్‌పై కనీసం రూ.3,000 వరకు తగ్గే అవకాశం ఉందని సమాచారం. లిక్కర్‌తో పాటు అధిక పన్నులు ఉన్న వైన్ ధరలను కూడా తగ్గించే యోచనలో ప్రభుత్వం ఉంది.
ధరలు తగ్గిస్తే అమ్మకాలు పెరిగి రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. త్వరలో జరిగే క్యాబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించిన తర్వాత కొత్త ధరలు అమలులోకి వచ్చే అవకాశముంది.
