
నాడు రజాకార్లకు ఎదురు నిలిచిన స్వాతంత్ర్య సమరయోధుడు… ఇప్పుడు కన్న కొడుకుల నిర్లక్ష్యానికి గురై వృద్ధాశ్రమంలో జీవనం సాగిస్తున్న ఘటన ఉమ్మడి నల్గొండ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
వలిగొండ గ్రామం కేశిపల్లికి చెందిన ఉంగరాల యాదగిరి (110) స్వాతంత్ర్య సమరయోధుడిగా గుర్తింపు పొందారు. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన, తర్వాత కష్టపడి 50 ఎకరాల భూమి సంపాదించుకున్నారు. యాదగిరికి భార్య లక్ష్మమ్మ, నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య పదిహేనేళ్ల క్రితం మరణించారు.
తర్వాత తన వద్ద ఉన్న 50 ఎకరాల భూమిలో నలుగురు కుమారులకు తలో 10 ఎకరాలు, ఇద్దరు కుమార్తెలకు చెరో 5 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. అంతేకాకుండా కుమారుల ఇళ్ల నిర్మాణానికి రూ.25 లక్షలు కూడా అందించారు.
అయితే ఆస్తి పంచుకున్న తర్వాత కుమారులు యాదగిరిని పట్టించుకోవడం మానేశారని తెలుస్తోంది. ఆయన ఒంటిపై ఉన్న బంగారాన్ని కూడా తీసుకుని ఇంటి నుంచి బయటకు పంపించారని ఆరోపణలు ఉన్నాయి. దిక్కుతోచని స్థితిలో ఉన్న యాదగిరిని కుమార్తెలు ఉప్పల్‌లోని ఓ వృద్ధాశ్రమంలో చేర్పించారు. అప్పటి నుంచి అక్కడే నివసిస్తున్నారు.
తనను మానసికంగా వేధిస్తున్న కుమారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన రాలేదని యాదగిరి వాపోతున్నారు. తన నుంచి తీసుకున్న 40 ఎకరాల భూమిని తాను బతికి ఉన్నంత వరకు తనకే చెందేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డిని వేడుకుంటున్నారు.
ఇలాంటి ఘటనలు సమాజంలో పెరుగుతున్నాయని, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ క్షీణించడం మరియు వ్యక్తిగత స్వార్థం పెరగడం ఇందుకు కారణమని మనస్తత్వ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
