
సృష్టిలో తొలి స్థానం తల్లిదే – మహిళల అభివృద్ధికి టీడీపీ కృషి : ఎమ్మెల్యే జూలకంటి
మాచర్ల ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ సృష్టిలో మొదటి స్థానం తల్లిదేనని ఆయన అన్నారు. ప్రతి స్త్రీ ఒక మాతృమూర్తి అని, సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.
మన సంస్కృతిలో తల్లి, తండ్రి, గురువు, దైవం అనే క్రమంలో తల్లికి తొలి స్థానాన్ని ఇచ్చారని తెలిపారు. ప్రతి బిడ్డకు తొలి గురువు తల్లేనని, చిన్నప్పటి నుంచే నడవడం, మాట్లాడడం వంటి జీవన విలువలను నేర్పేది తల్లేనని చెప్పారు.
కుటుంబ వ్యవస్థలో గానీ, సమాజ వ్యవస్థలో గానీ మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని ఆయన అన్నారు. ఒక మంచి అధికారి, సమాజ సేవకుడు, రాజకీయ నాయకుడు లేదా ఉద్యోగి సమాజానికి అందుబాటులోకి రావడానికి వారి వెనుక ఒక తల్లి ప్రోత్సాహం తప్పనిసరిగా ఉంటుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మహిళల అభివృద్ధి కోసం గతంలో చేపట్టిన చర్యలను ఆయన ప్రస్తావించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత సాధించారని గుర్తు చేశారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించి రాజకీయాల్లో వారికి అవకాశాలు కల్పించారని తెలిపారు.
మహిళలు విద్య, ఉపాధి రంగాల్లో ముందుకు రావడానికి కూడా పలు చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే దేశంలో గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసే దిశగా కృషి చేస్తోందని అన్నారు.
మహిళలు తమ హక్కులను వినియోగించుకొని అన్ని రంగాల్లో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మహిళలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
