

గురజాల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జంగిల్ రాజ్ కొనసాగుతుండగా, గురజాలలో గూండారాజ్ అంతకుమించి ఉందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి విమర్శించారు. అభివృద్ధి అనే మాటే లేదని ఆయన అన్నారు.
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం రామాపురం గ్రామంలో టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్త పిడుగు వీరారెడ్డిను మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో చట్టం, న్యాయం ఈ ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని ఆరోపించారు. దాడులు చేసే వారికి త్వరలోనే మూల్యం చెల్లించుకునే రోజు వస్తుందని హెచ్చరించారు.
ఈ ప్రభుత్వంలో కేసులు పెట్టినా న్యాయం జరగదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటానని బాధితుడు చెప్పడం రాష్ట్రంలోని పరిస్థితులను తెలియజేస్తుందని కాసు మహేష్ రెడ్డి అన్నారు.
