


మాచర్ల: పల్నాడు జిల్లాలో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజనీర్-ఇన్-చీఫ్ టి. గాయిత్రీ దేవి మాచర్ల మండలంలో పర్యటించారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్‌లో భాగంగా జిల్లాలో కొనసాగుతున్న పనులను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పనులు జరుగుతున్న తీరు పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రాజెక్ట్‌ను మరింత వేగంగా పూర్తి చేయడానికి అవసరమైన సూచనలు, సలహాలను అధికారులకు మరియు క్షేత్రస్థాయి సిబ్బందికి అందించారు.
ఈ సందర్భంగా గాయిత్రీ దేవి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రుల చొరవతో వెనుకబడిన పల్నాడు ప్రాంతానికి త్రాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఈ వాటర్ గ్రిడ్ పథకం మంజూరు చేయబడిందని తెలిపారు. ప్రజలకు శుద్ధమైన త్రాగునీరు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా మాచర్ల, గురజాల నియోజకవర్గాల పరిధిలోని అన్ని మండలాలు అలాగే పెదకూరపాడు నియోజకవర్గంలోని బెల్లంకొండ మండలానికి కలిపి మొత్తం 235 గ్రామాలకు త్రాగునీటి సరఫరా చేయనున్నట్లు తెలిపారు.
ప్రతి ఇంటిలోని ప్రతి వ్యక్తికి రోజుకు 55 లీటర్ల చొప్పున శుద్ధమైన త్రాగునీరు అందే విధంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు గాయిత్రీ దేవి వెల్లడించారు.
