

నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ కారు బైకును ఢీకొట్టడంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తికి సహాయం చేసేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో కారులో ఉన్న నలుగురు యువకులను ప్రమాదంపై ప్రశ్నించగా, వారు స్థానికులతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా రాడ్‌తో స్థానికులను కొట్టేందుకు ప్రయత్నించి అక్కడ హల్చల్ సృష్టించి అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. కారులో ఉన్న యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
