
పల్నాడు జిల్లా చిలకలూరిపేట పరిధిలోని నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామంలో పోలీసులు విస్తృతంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా చేపట్టిన ఈ తనిఖీలు ట్రైనీ డీఎస్పీ జై నిరంజన్ ఆధ్వర్యంలో జరిగాయి.
పోలీసులు గ్రామంలోని ప్రతి ఇంటిని, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 24 మోటార్ సైకిళ్లు, ఒక ఆటోను సీజ్ చేశారు. అదేవిధంగా అక్రమంగా నిల్వ ఉంచిన మూడు కత్తులను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ట్రైనీ డీఎస్పీ నిరంజన్ మాట్లాడుతూ, గ్రామంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించబోమని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అపరిచిత వ్యక్తులు గ్రామంలో కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని గ్రామస్తులకు సూచించారు. ఈ తనిఖీలతో గ్రామంలో భద్రతా పరిస్థితులు మరింత బలపడతాయని పోలీసులు పేర్కొన్నారు.
