
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేశారు. ప్రతి ఎమ్మెల్యే తమ నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను ప్రతివారం సందర్శించాలని సూచించారు. పాఠశాలల్లో ఉన్న వసతులు, విద్యార్థుల హాజరు వంటి అంశాలపై సమీక్ష చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వాలని తెలిపారు.
విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించవద్దని కొంతమంది మిత్రులు సూచించినప్పటికీ, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ సవాలును స్వీకరించానని లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేయడం తన లక్ష్యమని అన్నారు.
ప్రతి ఎమ్మెల్యే తమ నియోజకవర్గంలో ప్రతి మండలానికి కనీసం రెండు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని, అక్కడ విద్యార్థుల సంఖ్యను రెట్టింపు చేసేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక పాఠశాల వెయ్యి మంది విద్యార్థులతో కళకళలాడాలని ఆకాంక్షించారు.
ఎమ్మెల్యేలు పాఠశాలలను సందర్శించి అందిస్తున్న సూచనల ఆధారంగా అక్కడి లోపాలను వెంటనే సరిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని లోకేష్ హామీ ఇచ్చారు. విద్యా వ్యవస్థ బలోపేతం అనేది కేవలం మంత్రి లేదా అధికారుల బాధ్యత మాత్రమే కాదని, ప్రజాప్రతినిధులు మరియు సమాజం కలిసి పనిచేస్తేనే రాబోయే తరాలకు అవసరమైన గొప్ప సంస్కరణలు తీసుకురాగలమని ఆయన పేర్కొన్నారు.
