
నరసరావుపేట పట్టణంలో ఆయిల్ మిల్లులపై విజిలెన్స్ మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. అధికారుల దాడుల సమాచారం అందడంతో కొన్ని మిల్లుల యజమానులు గుట్టుచప్పుడు కాకుండా మిల్లులను మూసివేసి అక్కడి నుండి పరారైనట్లు సమాచారం.
ముఖ్యంగా కోటప్పకొండ రోడ్డులో ఉన్న ఓ ప్రముఖ ఆయిల్ మిల్లులో గత ఎన్నో ఏళ్లుగా కల్తీ జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఆకస్మిక దాడులతో నరసరావుపేటలోని ఆయిల్ వ్యాపారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే కొందరు స్థానికులు, వ్యాపారులు మాత్రం అధికారులు ఒకరోజు దాడులు చేసి ముడుపులు అందిపుచ్చుకుని మళ్లీ ఆయిల్ వ్యాపారులపై కన్నెత్తి కూడా చూడరని ఆరోపణలు చేస్తున్నారని తెలుస్తోంది.
నెలనెలా మామూళ్లు స్వీకరిస్తూ తూతూ మంత్రంగా దాడులు చేస్తున్న అధికారులపై, అలాగే కల్తీ చేస్తున్న వ్యాపారులపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
