
మాచర్ల టౌన్‌లోని గర్ల్స్ హై స్కూల్ మరియు సెయింట్ ఆన్స్ గర్ల్స్ స్కూల్‌లలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కరాటే శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని అర్బన్ సీఐ వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి సీఐ వెంకటరమణ మాట్లాడుతూ, మహిళలు స్వీయ రక్షణలో దిట్టలు కావాలని, ప్రతి అమ్మాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. సమాజంలో మహిళలపై జరిగే అన్యాయాలను ఎదుర్కొనే ధైర్యం ప్రతి ఒక్కరికీ ఉండాలని తెలిపారు. కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ శిక్షణలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక బలాన్ని కూడా పెంచుతాయని చెప్పారు.
అలాగే అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, అనుమానాస్పద సంఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలనే అంశాలపై అవగాహన కల్పించారు. మహిళల భద్రత కోసం పోలీసు శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థినులు కరాటే ప్రదర్శనలు ఇవ్వగా, అందరూ అభినందించారు.
