
వినుకొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రతిపక్ష వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
వైసీపీ ప్రభుత్వం హయాంలో ఒక్క రైతుని కూడా సరైన విధంగా ఆదుకోలేదని ప్రశ్నించిన జీవీ, రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసి నెలల తరబడి డబ్బులు చెల్లించలేదని విమర్శించారు.
అబద్ధాలు చెప్పడంలో వైసీపీ నాయకుడు బొల్లా బ్రహ్మనాయుడు ముందుంటారని వ్యాఖ్యానిస్తూ, “మీరు నీతులు చెప్పడం దొంగే దొంగ అన్నట్టుంది” అంటూ ఘాటుగా స్పందించారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రైతుల పట్ల కట్టుబడి ఉందని, ముఖ్యంగా మొక్కజొన్న రైతులకు అవసరమైన మద్దతు అందిస్తామని తెలిపారు. పల్నాడు జిల్లాలో 50 వేల ఎకరాల్లో హార్టికల్చర్ పంటలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
వైసీపీ హయాంలో రైతులకు జరిగిన నష్టాన్ని ప్రస్తుత ప్రభుత్వం భర్తీ చేస్తుందని స్పష్టం చేసిన జీవీ, జిల్లాకు పలు హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
గత ఐదేళ్ల పాటు వైసీపీ అసత్య ప్రచారాలను విన్న ప్రజలు ఇప్పుడు తగిన తీర్పు ఇచ్చారని జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు.
