
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైల్ నుంచి విడుదల అనంతరం నకరికల్లు చేరుకున్నారు. ఈ సందర్భంగా నకరికల్లు అడ్డరోడ్డులోని శ్రీ అభయాంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పిన్నెల్లికి స్వాగతం పలికేందుకు సత్తెనపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి, వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి, వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో మే 24న జరిగిన ఘటనపై స్పందించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో ఒకరినొకరు చంపుకున్న ఘటనను కావాలని తనపై మోపారని ఆరోపించారు.

తనపై తప్పుడు కేసు పెట్టి 98 రోజుల పాటు జైలులో ఉంచడం బాధాకరమని అన్నారు. గతంలో కూడా ఆ గ్రామంలో వర్గపోరు జరిగినట్లు, జిల్లా ఎస్పీ సైతం దీనిని ఆధిపత్య పోరుగా పేర్కొన్నారని తెలిపారు.
కేవలం రాజకీయ కక్షతోనే టీడీపీ తమను ఈ కేసులో ఇరికించిందని విమర్శించారు. “మాకూ ఒక రోజు వస్తుంది. ఆ రోజున ఎవరినీ వదిలిపెట్టము. ఈ తప్పుడు కేసుల వెనుక ఉన్న వారిని చట్టం ముందు నిలబెడతాం” అని హెచ్చరించారు.
కేవలం రాజకీయ కక్షతోనే టీడీపీ తమను ఈ కేసులో ఇరికించిందని విమర్శించారు. “మాకూ ఒక రోజు వస్తుంది. ఆ రోజున ఎవరినీ వదిలిపెట్టము. ఈ తప్పుడు కేసుల వెనుక ఉన్న వారిని చట్టం ముందు నిలబెడతాం” అని హెచ్చరించారు.
కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తోందని, ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు పెట్టి నోరు మూయించాలని చూస్తోందని ఆరోపించారు.
ఎన్ని ఇబ్బందులు పెట్టినా తాము వెనుకడుగు వేయబోమని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో రెట్టింపు వేగంతో ముందుకు సాగుతామని పిన్నెల్లి స్పష్టం చేశారు.
