
అమరావతి:
రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమానికి మరో ముందడుగు వేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.
పథకం ప్రారంభ సందర్భంగా మంగళగిరి బస్టాండ్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించారు. మంగళగిరి నుంచి పెనుమాక వరకు సుమారు 11 కిలోమీటర్ల మేర బస్సులో ప్రయాణిస్తూ దివ్యాంగులతో మమేకమయ్యారు.
ఈ ప్రయాణంలో భాగంగా దివ్యాంగుల సమస్యలు, వారికి అందుతున్న సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్ నేరుగా మాట్లాడి తెలుసుకున్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత దివ్యాంగులకు కల్పిస్తున్న సదుపాయాలపై వారు వివరించారు.
పథకం ప్రారంభోత్సవానికి భారీగా ప్రజలు, కూటమి పార్టీల కార్యకర్తలు, లబ్ధిదారులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
