
అమరావతి:
ఉగాది పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని నేటి నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని దివ్యాంగులకు APSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగింది.
ఈ పథకం ప్రకారం 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. వీరికి ప్రత్యేకంగా ‘జీరో టికెట్’ జారీ చేస్తారు.
దివ్యాంగులతో పాటు ప్రయాణించే సహాయకులకు (Escorts) టికెట్ ధరలో 50 శాతం రాయితీ ఇవ్వనున్నారు. గతంలో కేవలం నాలుగు వర్గాలకే పరిమితమైన ఈ సౌకర్యాన్ని ఇప్పుడు 21 రకాల వైకల్యాల వరకు విస్తరించారు, దీని వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 11.16 లక్షల మందికి లాభం చేకూరనుంది.
ఇప్పటికే ఉన్న రాయితీ పాస్‌లు చెల్లుబాటు అవుతాయి. కొత్తగా పాస్ పొందాలనుకునే వారు SADAREM సర్టిఫికేట్, ఆధార్ కార్డుతో ఆన్‌లైన్ లేదా బస్ పాస్ కౌంటర్లలో దరఖాస్తు చేసుకోవచ్చు.
అదనంగా, సూపర్ లగ్జరీ మరియు ఏసీ బస్సుల్లో గతంలో ఉన్నట్లే 50% రాయితీ కొనసాగుతుంది.
