

మాచర్ల పట్టణంలో సేవా కార్యక్రమంగా కృత్రిమ పాదాల ఎంపిక శిబిరం ఘనంగా నిర్వహించారు. రోటరీ క్లబ్ ఆఫ్ మాచర్ల, వాసవి క్లబ్ ఆఫ్ చెన్నకేశవ ఆధ్వర్యంలో, కెసిపి సిమెంట్ ఫ్యాక్టరీ సహకారంతో, ఎన్.ఆర్.ఐ.వి.ఏ ఫౌండేషన్ పూర్తి ఆర్థిక సహాయంతో ఈ శిబిరం డాక్టర్ వి.ఎల్. దత్ ఆడిటోరియంలో జరిగింది.
కార్యక్రమాన్ని కెసిపి సీనియర్ జనరల్ మేనేజర్ వి. వెంకటరమణ, రోటరీ డిస్ట్రిక్ట్ 3150 డిసీజ్ అండ్ ప్రివెన్షన్ చైర్మన్ డాక్టర్ కొండవీటి రామకోటయ్య, డిస్ట్రిక్ట్ డైరెక్టర్ ఇక్కుర్తి శంకర్, వాసవి క్లబ్ జోనల్ చైర్మన్ ఓరుగంటి చెన్నకేశవరావు, మున్సిపల్ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర, ఎన్నారై పంతంగి లక్ష్మీనారాయణ సమక్షంలో ప్రారంభించారు.
ఈ శిబిరంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం నుండి వచ్చిన రంగారావు, సాంబశివరావు, నరేంద్రల సాంకేతిక బృందం సహాయంతో వివిధ జిల్లాల నుంచి వచ్చిన 150 మందికి పైగా దివ్యాంగులకు పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి కృత్రిమ పాదాలు అమర్చేందుకు కొలతలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ, కృత్రిమ పాదాలు పొందిన దివ్యాంగులు స్వయం ఉపాధి ద్వారా తమ జీవన స్థితిని మెరుగుపరుచుకోవాలని, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందుతూ ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.
ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించేందుకు ఎప్పుడూ ముందుంటామని రోటరీ సెక్రెటరీ ఆలేటి కోటేశ్వరరావు, ప్రోగ్రాం కన్వీనర్ పఠాన్ నాగూర్ వలి తెలిపారు.
ఈ కార్యక్రమంలో కెసిపి హెచ్.ఆర్ ఉదయ్ కుమార్, సీనియర్ రోటేరియన్ సభ్యులు మారేపల్లి లక్ష్మీనారాయణ, సిద్ధం రాజు, చెరుకూరి నరసింహారావు, శివ మెడికల్స్ రామ్మూర్తి, పందిరి బాల గురవయ్య తదితరులు పాల్గొన్నారు.
