
దుర్గి మండలంలో ట్రాక్టర్–బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఓబులేశునిపల్లె గ్రామం వద్ద ఉన్న మొక్కజొన్న ఫ్యాక్టరీ సమీపంలో సోమవారం రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో జరిగింది.
వివరాల ప్రకారం… ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం శతకోడు గ్రామానికి చెందిన కంచిపోగు దావీదు (25), తండ్రి యోబు, జీవనోపాధి కోసం వలసగా వచ్చి గురజాల మండలం మాడుగుల గ్రామంలో నివసిస్తూ మొక్కజొన్న పనులు చేసుకుంటున్నాడు. ఇదే గ్రామం నుండి సుమారు 100 మంది పనుల నిమిత్తం ఇక్కడికి వచ్చినట్లు సమాచారం.
సోమవారం తన బంధువును శతకోడు గ్రామానికి తీసుకెళ్లి తిరుగు ప్రయాణంలో వస్తుండగా, ఓబులేశునిపల్లె సమీపంలోని మొక్కజొన్న ఫ్యాక్టరీ వద్ద గుర్తుతెలియని ట్రాక్టర్‌ను ఢీకొనడంతో బైక్‌పై నుంచి పడిపోయి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది.
సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై సుధీర్ కుమార్ పోలీసులతో సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి నివేదిక అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.
మృతుడికి స్వందన అనే 6 నెలల గర్భిణీ భార్య ఉండటం కుటుంబాన్ని విషాదంలో ముంచింది.
