
బాలల హక్కుల సాధన కోసం బాల్య వివాహాలను అరికట్టడానికి యువత నడుం బిగించాలని కస్తూరిబా గాంధీ గిరిజన గురుకుల విద్యాలయం ప్రిన్సిపాల్ ఆకుల ఆశాజ్యోతి అన్నారు. సోమవారం కస్తూరిబా గాంధీ గిరిజన గురుకుల పాఠశాలలో బాల్య వివాహాల నిషేధంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పిలుపు మేరకు మహిళా అభివృద్ధి మరియు సంక్షేమ శాఖ నరసరావుపేట ప్రాజెక్ట్ అధికారి ఎం. ఉమాదేవి ఆదేశాలనుసారం సఖీ వన్ స్టాప్ సెంటర్ టీమ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ సందర్భంగా ఆకుల ఆశాజ్యోతి మాట్లాడుతూ బాలల రక్షణ, వారి హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం “బేటీ బచావో – బేటీ పడావో” వంటి కార్యక్రమాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నదని తెలిపారు. టీనేజ్ వయస్సు వచ్చేవరకు పెళ్లి చేసుకోవద్దని, చదువు ప్రతి ఒక్కరి హక్కు అని విద్యార్థులకు సూచించారు. తమ తల్లిదండ్రులకు కూడా ఈ విషయాన్ని చెప్పి చదువు కొనసాగించాలని ఆమె పిలుపునిచ్చారు.
సఖీ వన్ స్టాప్ సెంటర్ కౌన్సిలర్ చౌహన్ సుప్రజ మాట్లాడుతూ టీనేజ్‌లో గర్భధారణ, బాల్య వివాహాల నిషేధంపై ప్రజల్లో చైతన్యం కల్పించడానికి తమ సంస్థ కృషి చేస్తున్నదన్నారు. అంగన్వాడీ సూపర్వైజర్ సహకారంతో జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లతో కలిసి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
కేస్ వర్కర్ గరికపాటి నవీన్ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా బాధితులకు అందించే సేవల గురించి వివరించారు. ఆపదలో ఉన్న వారికి వసతి, వైద్యం, పోలీస్ రక్షణ కల్పించడం తో పాటు కౌన్సిలింగ్ కూడా అందిస్తున్నామని చెప్పారు.
మరో కేస్ వర్కర్ పచ్చల స్రవంతి విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి “బాల్య వివాహాలు వద్దు – చదువే ముద్దు” అనే నినాదాలతో అవగాహన కల్పించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి కూడా విద్యార్థులకు వివరించారు. మాచర్లలో కూడా కౌన్సిలింగ్ సెంటర్ పనిచేస్తుందని తెలిపారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతుంటే వెంటనే 101, 109 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు అంగన్వాడీ టీచర్లు ప్రమీల, లీలావతి, శారద, ఐ.వి. పద్మావతి, సీతమ్మ, పద్మ తదితరులు పాల్గొన్నారు.
