

పల్నాడు జిల్లా గురజాలలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (జీడీసీసీ) శాఖలో గత ప్రభుత్వ కాలంలో జరిగిన భారీ అవినీతి వ్యవహారంపై జిల్లా యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. బ్యాంకు నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో గురజాల శాఖ చీఫ్ మేనేజర్ కే. పున్నారావును సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్, సహకార బ్యాంకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
గత ప్రభుత్వ కాలంలో బ్యాంకు నిబంధనలను పక్కనబెట్టి ఇష్టానుసారంగా రుణాలు మంజూరు చేయడం, రికవరీలో నిర్లక్ష్యం చూపడం, కొంతమంది రుణగ్రహీతలతో కుమ్మక్కై బ్యాంకు నిధులను పక్కదారి పట్టించడం వంటి ఆరోపణలు వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఈ వ్యవహారంపై ప్రభుత్వం గత నెలలో ప్రత్యేక విచారణకు ఆదేశించగా, విచారణలో గురజాల శాఖ పరిధిలోని కొన్ని పీఏసీఎస్ అధికారులు, బ్యాంకు సిబ్బంది కలిసి సుమారు రూ.11.66 కోట్ల వరకు బ్యాంకు నిధులను దుర్వినియోగం చేసినట్లు తేలింది. ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధంగా రుణాల మంజూరు చేయడం, రికవరీ చేయకపోవడం వల్లే ఈ భారీ నష్టం సంభవించినట్లు నివేదికలో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. అందులో భాగంగా గురజాల జీడీసీసీ బ్యాంకు చీఫ్ మేనేజర్ కే. పున్నారావును సస్పెండ్ చేశారు. ఇతనితో పాటు జిల్లాలో మరో ముగ్గురు మేనేజర్లపై కూడా సస్పెన్షన్ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
ఈ ఘటనతో సహకార బ్యాంకుల్లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలని ప్రజలు, రైతులు కోరుతున్నారు.
