




పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో సోమవారం ప్రారంభమైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా సాగాయి. పట్టణంలోని వివిధ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు ఉదయం ఎనిమిది గంటలకే తల్లిదండ్రులతో కలిసి చేరుకున్నారు.
పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు తమకు కేటాయించిన హాల్ టికెట్ నంబర్లు, గదులను చూసుకుంటూ కనిపించారు. కొంతమంది విద్యార్థులు పరీక్షల ఒత్తిడితో ఆందోళనకు గురవుతుండగా తల్లిదండ్రులు ధైర్యం చెప్పి పరీక్షలను ధైర్యంగా రాయాలని ప్రోత్సహించారు.
పరీక్షలు జరుగుతున్న సమయంలో పరీక్షా కేంద్రాల గేట్ల వద్ద తల్లిదండ్రులు తమ పిల్లలు ఎప్పుడు బయటకు వస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తూ కనిపించారు.
పరీక్షలకు హాజరైన విద్యార్థుల సౌకర్యార్థం విద్యాశాఖ అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, ప్రాథమిక వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
