
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 24 నుంచి సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టనున్న నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, పల్నాడు జిల్లా ఇంచార్జి అక్కినేని వనజ పిలుపునిచ్చారు.
స్థానిక సిపిఐ కొమెరా వీరస్వామి భవన్‌లో ఆదివారం మహిళా సంఘం నాయకురాలు నాగమణి అధ్యక్షతన జరిగిన ఏరియా, మండల కార్యదర్శుల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పాలనలో బడుగు బలహీన వర్గాల సంక్షేమం కరువైందన్నారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ ప్రజా సంక్షేమానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు.
కార్మిక సంక్షేమ చట్టాలను లేబర్ కోడ్‌లుగా మార్చడం, ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చడం దుర్మార్గమన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలులో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. అలాగే టిడ్కో ఇండ్లను వెంటనే లబ్ధిదారులకు అందించాలని డిమాండ్ చేశారు.
పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాదరావు, జిల్లా సహాయ కార్యదర్శి షేక్ హుస్సేన్, ఏరియా కార్యదర్శి మేకపోతుల శ్రీనివాసరెడ్డి, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము మాట్లాడుతూ టిడ్కో ఇండ్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికీ డెవలప్ చేసిన భూముల్లో వాటా ఇవ్వలేదని అన్నారు.
రాష్ట్రంలో పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇచ్చి ఇళ్ల నిర్మాణం చేపడతామని ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం పార్టీ బలోపేతం, నిధుల సేకరణ, సభ్యత్వాల నమోదు వంటి అంశాలపై చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేలా ఈ నెల 24 నుంచి చేపట్టనున్న నిరసన కార్యక్రమాల్లో కార్మికులు, ప్రజాసంఘాల నాయకులు, ప్రజలు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో మాచర్ల, కారంపూడి సెక్రటరీలు మిద్దెపోగు బాబురావు, షేక్ సైదా, ఏఐవైఎఫ్ నాయకులు నర్రా రంగస్వామి, కందుకూరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
